Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కేంద్ర బడ్జెట్ పై ఏపీ స్పందన అలా… తెలంగాణ స్పందన ఇలా…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా బడ్జెట్ పై కీలక ప్రసంగం చేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా వుందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అభివర్ణించారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని, సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోందన్నారు. అయితే… దీనిపై వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు భిన్నంగా స్పందించాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బి. వినోద్ మాత్రం బడ్జెట్ పై విమర్శలు చేశారు.

 

ఆర్ధిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ ఇవాళ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌కు చెందిన బడ్జెట్‌లా ఉంద‌ని ఎమ్మెల్సీ క‌విత విమ‌ర్శించారు. మోదీ ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింద‌న‌డానికి ఈ బ‌డ్జెటే ఊదాహ‌ర‌ణ అని ఆమె అన్నారు. 10 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు క‌ల్పిస్తార‌ని ఆశించామ‌ని, ప్ర‌స్తుతం మంత్రి ప్ర‌క‌టించిన రిబేట్ ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మాత్రం ల‌బ్ధి చేకూరేలా కేంద్రం డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించింద‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. మౌళిక‌స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ప‌దివేల కోట్లు కేటాయిస్తున్నార‌ని చెప్పార‌ని, కానీ ఎటువంటి మౌళిక‌సదుపాయాలో ఆ బ‌డ్జెట్‌లో వెల్ల‌డించ‌లేద‌ని విమర్శించారు.

 

ఇక… బీఆర్ఎస్ సీనియర్ నేత బి. వినోద్ మాట్లడారు. పూర్తిగా ఆచరణ సాధ్యం కానిదని విమర్శించారు. ఏ రంగానికీ మేలు చేయని ఘోరమైన బడ్జెట్ అని, తెలంగాణలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కోరినా… స్పందన లేదన్నారు. రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా కేటాయించలేదన్నారు.

 

మరోవైపు కేంద్రం బడ్జెట్ పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయన్నారు. కొన్ని కేటాయింపులు బాగున్నాయని, మొత్తంగా బడ్జెట్ బాగుందని కితాబునిచ్చారు. ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామమని, కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు చేశారన్నారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయని, వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రోడ్లు, రైల్వేలకు పెంచారని విశ్లేషించారు. రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో తాము చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని బుగ్గన పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates