కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని సీపీఎం ఆరోపించింది. ఇలాంటి ప్రయత్నాలను ప్రజామద్దతుతో తిప్పికొడతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలక్రిష్ణన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విజయన్ కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. గవర్నర్‌ను, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని తమ ప్రభుత్వాన్ని కేంద్రం లక్ష్యంగా చేసుకున్నదని ధ్వజమెత్తారు. కేరళ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు(కేఐఐఎఫ్‌బీ) నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, ఇటువంటి చర్యలను కేరళ ప్రజలు ఎంతమాత్రం ఆమోదించరని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న కేఐఐఎఫ్‌బీ ఆర్థిక కార్యకలాపాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ ఇటీవల రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్‌కు నోటీసులు ఇచ్చింది.
