ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకూ కేంద్ర సాంస్కృతిక శాఖ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ తిరంగా బైక్ ర్యాలీలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ బైక్ లకు త్రివర్ణ పతాలను తగిలించుకొని, పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల స్మృత్యర్థం ఈ ర్యాలీ జరిగింది. త్రివర్ణ పతాకం స్ఫూర్తిని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో పార్లమెంట్ సభ్యులు పనిచేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
దేశ స్వాతంత్య్రం కోసం, ఐక్యత కోసం సర్వం త్యాగం చేసిన అందరినీ గుర్తు చేసుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. భారత దేశ అస్తిత్వంలో సంప్రదాయాలతో పాటు జాతీయ భావన కూడా ఎంతో కీలకమని అన్నారు. ఈ భావనను అనుక్షణం మనకు గుర్తు చేయడంలో త్రివర్ణ పతాకం ప్రేరణాత్మకమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.