ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వీడ్కోలు సభ సందర్భంగా పార్టీల నేతలందరూ ఆయన సేవలను కొనియాడారు. రాజ్యసభ గౌరవాన్ని పెంచేందుకు వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన వ్యంగ్యం, ఉపన్యాస శైలి అందర్నీ ఆకట్టుకుంటాయని, ఆయన పని విధానం కూడా ఎంతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇక… టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా వీడ్కోలు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఏడాది వయస్సులోనే తల్లిని కోల్పోయారని ఆయన అనగానే.. వెంకయ్య నాయుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఓ నిమిషం పాటు రాజ్యసభ అంతా గంభీరంగా మారిపోయింది.
అయితే.. నూతన సాగు చట్టాల బిల్లును పాస్ చేసినప్పుడు చైర్ లో లేరని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆత్మకథలో రాస్తారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 2013 లో సభలో పెగాసెస్ గురించి చర్చించాలని తామెంతో ప్రయత్నాలు చేశామని, కానీ.. చేయలేకపోయామని గుర్తు చేశారు. ఇక… పదవీ విరమణ అనంతరం జీవితంలో జరిగిన ఘట్టాలతో ఆత్మకథ రాయాలని రాజ్యసభ ఎంపీలందరూ సూచించారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో జూనియర్, సీనియర్ ఎంపీలు అన్న తారతమ్యం చూపకుండా అందర్నీ సమానంగా చూశారని ఎంపీలు కొనియాడారు. ఈ నెల 10 తో వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తికానుంది.