కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనకు, పార్టీకి మధ్య వున్న పేగు బంధం తెగిపోయిందన్నారు. మోదీ, షా ఇచ్చే కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి కాంగ్రెస్ ను వీడారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఈడీ వేధిస్తుంటే.. దానిపై పోరాటం చేయాల్సింది పోయి… కాంట్రాక్టుల కోసం బీజేపీతో కలిసిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ మీడియాతో మాట్లాడారు.
మోదీ, షా తో చేతులు కలిపి, సోనియాకు కోమటిరెడ్డి వెన్నుపోటు పొడిచారన్నాను. తాను మనిషి అని చెప్పుకునే అర్హత కూడా కోమటిరెడ్డికి లేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నికలకు తాము రెడీ అయ్యామని, సమర శంఖం పూర్తిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోమటిరెడ్డికి కాంగ్రెస్ ఏం చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. ఎంపీగా ఆయన ఓడిపోతే.. ఎమ్మెల్సీ ఇచ్చిందని, ఆ తర్వాత ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఇచ్చామని గుర్తు చేశారు. తాము వారి కుటుంబం గౌరవం పెరిగేలా చూశామే తప్ప, ఎక్కడా తక్కువ చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.