క్లౌడ్ బరెస్ట్ ద్వారా విదేశాలు కుట్రలు పన్నుతున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. దానికి ఆధారాలు కావాలంటూ డిమాండ్ చేశారు. ఇక.. మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందిస్తూ.. అది సాధ్యం కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వ్యాఖ్యలంటూ ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. కేంద్రం ఈ వ్యాఖ్యలపై విచారణ చేపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిఘా సంస్థలకు సీఎం కేసీఆర్ తగిన ఆధారాలివ్వాలని అన్నారు. వరదలు వచ్చి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ఒత్తిడితోనే సీఎం తన క్యాంపు ఆఫీస్ నుంచి కదిలారని, అయినా.. ఆదుకునేందుకు ఎలాంటి ప్రకటనలూ చేయలేదని రేవంత్ మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ క్లౌడ్ బస్టర్ అంటూ చేసిన వ్యాఖ్యలు అత్యంత సిల్లీ అంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలంటూ ఫైర్ అయ్యారు. సీఎం స్థాయిలో వున్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి మాటలు సరైనవి కావని, కుట్రలతో క్లౌడ్ బరస్ట్ అనేది అసలు సాధ్యమయ్యే ముచ్చటే కాదని స్పష్టం చేశారు.