టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ (SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ గురువారం సిట్ ముందు హాజరయ్యారు. సిట్ విచారణ ముగిసిన తర్వాత రేవంత్ విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యల నేపథ్యంలోనే తాను సిట్ విచారణకు హాజరయ్యానని పేర్కొన్నారు. ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్ నోటీసులు జారీ చేస్తోందని, అలా అయితే… మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం మంత్రి కేటీఆర్ వద్ద వుందని, సిట్ దర్యాప్తు అధికారి ఏఆర్ శ్రీనివాస్ కి చెప్పానని రేవంత్ వెల్లడించారు.
అసలు కేటీఆర్ నుంచి సిట్ సమాచారం ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. ఆరు దశాబ్దాలు పోరాటం తరువాత తెలంగాణా సాధించుకున్నామన్నారు. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అమర వీరుల కుటుంబాలని తెలిపారు. 2009 మలి ఉద్యమం కూడా ఉద్యోగాల నియామాకాల పైనే జరిగిందని చెప్పారు. ప్రాణా త్యాగాలు చేసి తెలంగాణాను నిలబెట్టారని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక దేవాలయం, మసీదు, ప్రార్థనా మందిరం లాంటిదని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం నమ్మకం కలిగించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు.
టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయిందని, పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. సిట్ కాదు… సీబీఐ విచారణ కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచిందని వివరించారు. తప్పును ఎత్తి చూపడమే నేరమట. వెనక్కు తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.