తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు చనిపోతే.. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కుక్క కరిచి బాలుడు చనిపోతే.. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
ఐదేళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కుక్కలకు ఆకలేసిందని హైదరాబాద్ మేయర్ మాట్లాడుతున్నారని చెప్పారు. వీధి కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని మండిపడ్డారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగు సంవత్సరాల బాలుడు మరణించాడు. ఈ ఘటన ఛే నెంబర్ దగ్గర జరిగింది. కుక్కలన్నీ ఆ చిన్నారిపై దాడి చేయడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించడం దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. వీధి కుక్కల నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. తాము జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆ బిడ్డను తిరిగి తీసుకురాలేనని తనకు తెలుసని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.