TSPSC పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. లీకేజీకి సంబంధించిన వివరాలు అందజేయాలని సీఆర్పీసీ 91 కింద నోటీసులిచ్చింది. అయితే.. దీనిపై రేవంత్ స్పందించారు. సిట్ నోటీసులు ఊహించిందేనని అన్నారు. సిట్ నోటీసులను స్వాగతిస్తున్నానని, మంత్రి కేటీఆర్, సబిత, శ్రీనివాస్ గౌడ్ తో పాటు సిట్ అధికారి శ్రీనివాస్ కి కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర వున్న ఆధారాలను సిట్ కి అందజేస్తానని, కేటీఆర్ కి నోటీసులివ్వకపోతే మాత్ర కోర్టుకు వెళ్తానని రేవంత్ సంచలన ప్రకటన చేశారు.
సిట్ అధికారి శ్రీనివాస్, కేటీఆర్ (KTR) బావమరిది ఇద్దరూ ఫ్రెండ్సే అని, ఇద్దరూ ఫ్రెండ్స్ అన్నందుకే తనకు సిట్ నోటీసులు ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌కు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు.కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగిందన్నారు.కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆఫీస్ నుంచే లీకేజీ వ్యవహారం మొత్తం నడిచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.