గుంటూరు జిల్లా పెద్దకాకాని వద్ద వైసీపీ ప్లీనరి కారణంగా ఈ నెల 8,9 తేదీల్లో వాహనాల మళ్లింపు వుంటుందని విజయవాడ కమిషనర్ కాంతిరాణా ప్రకటించారు. 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ నెల 8,9 తేదీల్లో వాహనాలను మళ్లిస్తున్నామని ప్రకటించారు. జాతీయ రహదారిపై ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని తెలిపారు. చైన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి దారి మళ్లించనున్నారు.
చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి వుంటుంది. గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు బుడంపాడు మీదుగా తెనాలి, కొల్లూరు, పెునుమూడి వారధి, అవనిగడ్డ మీదుగా మళ్లిస్తారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వారు హనుమాన్ జంక్షన్ నుంచే దారి మళ్లించి, గుడివాడ మీదుగా అవనిగడ్డ, రేపల్లె, చీరాల మీదుగా ఒంగోలు వెళ్లేలా చూడనున్నారు.
విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చే వారిని ఇబ్రహీంపట్నం నుంచి దారి మళ్లించి, హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లాలి. రాత్రి 10 గంటల తర్వాతే భారీ వాహనానలు జాతీయ రహదారి పైకి అనుమతిస్తారు. మరోవైపు ప్లీనరి కోసం వచ్చే వాహనాల కోసం కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని విజయవాడ సీపీ తెలిపారు.