ఢిల్లీ లిక్కర్ మాఫీయాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హస్తం వుందంటూ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వాద ప్రతివాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడిని ఆయన ఖండించారు. బీజేపీ నాయకులు కవిత ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మను ఎవరు పట్టించుకోని సమయంలో కవిత ఒక గుర్తింపు తెచ్చారని చెప్పారు. కేసీఆర్ ది మచ్చలేని కుటుంబమని..ప్రాణాలకు తెగించి మరీ తెలంగాణను సాధించినట్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టుమని బండి సంజయ్ కు మోడీ చెప్పారని మంత్రి ఆరోపించారు.
ఇక… ఇదే విషయంపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండించారు. తాము దాడులకు పాల్పడితే బీజేపీ తట్టుకుంటుందా అని ప్రశ్నించారు. బీజేపీ తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తాము కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇళ్లపై దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే బీజేపీ బతుకులు ఆగమవడం ఖాయమని, కవితను ఇబ్బందులకు గురిచేసి.. కేసీఆర్ ను రాష్ట్రానికే పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఇక… మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించారు. తమ జోలికి వస్తే బీజేపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సీఎం కేసీఆర్‌కు భయపడి అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.