అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. హష్ మనీ చెల్లింపులో కేసులో ట్రంప్ ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్ లోని కోర్టు ముందు హాజరుపరిచారు. ట్రంప్ కార్ల ర్యాలీతో లొంగిపోయేందుకు కోర్టు హాలు వద్దకు చేరుకున్నారు. చేరుకోగానే అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాతే కోర్టులో హాజరుపరిచారు. అమెరికా చరిత్రలోనే మాజీ అధ్యక్షుడు అరెస్టవ్వడం ఇదే మొదటిసారి. భారత కాలమాన ప్రకారం రాత్రి 11:45 నిమిషాలకు న్యాయమూర్తి ముందు ట్రంప్ ను హాజరుపరిచారు. ఈ సందర్భంగా ట్రంప్ పై నమోదైన 34 నేరాభియోగాలను చదివి వినిపించారు.
అయితే… ఈ నేరాన్ని ట్రంప్ అంగీకరించలేదు. తాను ఏ నేరమూ చేయలేదంటూ కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇక… విచారణకు ముందు రికార్డుల కోసం ట్రంప్ వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. చివరికి ట్రంప్ ను పోలీసులు విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం కోర్టులో లొంగిపోయిన ట్రంప్.. తాను డేనియల్‌ను కలిసిన విషయం వాస్తవమేనని, అయితే ఆమెతో లైంగిక సంబంధాలు లేవని వాదనలు వినిపించారు. తనకేపాపం తెలియదని, తనను దోషిగా ప్రకటించవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ పాలనపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మార్కిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించే ప్రపంచ దేశంగా అమెరికా మారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి నేరం చేయకపోయినా… తనను అరెస్ట్ చేసేందుకు అధికార పార్టీ కుట్రలకు తెరలేపిందన్నారు. దేశం నాశనం అవుతోందని, నరకం వైపు అడుగులు వేస్తోందని విరుచుకుపడ్డారు. ప్రపంచ దేశాలు అమెరికాని చూసి నవ్వుతున్నాయన్నారు. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ 2006లో లేక్‌తాహో హోటల్‌లో స్టార్మీ డేనియల్స్ అనే నటితో శృంగారంలో పాల్గొన్నాడనే ఆరోపణలున్నాయి. స్వయంగా డేనియల్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ట్రంప్‌ను ఓ కార్యక్రమంలో కలుసుకున్నానని, ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నానని ఆమె చెప్పారు.