75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 21 న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని స్థానిక సంస్థల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 22 వరకూ నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. స్వాతంత్ర్య స్ఫూర్తి అందరిలో ప్రజ్వరిల్లేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఇలా.. అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఇక.. రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. ఈ నెల 9 నుంచే ఇది ప్రారంభం కావాలన్నారు. ఆగస్టు 15 న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేలా చూడాలన్నారు.
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. 9 న జాతీయ జెండాల పంపిణీ ప్రారంభిస్తారు. 10 న ప్రతి ఊరిలో మొక్కలు నాటడం, 11 న ఫ్రీడం రన్, 12 న వజ్రోత్సవాల కార్యక్రమాల ప్రసారం కోసం మీడియాను కోరడం, 13 న వజ్రోత్సవాల ర్యాలీలు, 14 న నియోజకవర్గ కేంద్రాల్లో సాంస్కృతిక వారధి ఈధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం, 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16 న సామూహిత జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వక్ష్ణ, 17 న రక్తదాన శిబిరాలు, 18 న ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీలు, 19 న ఆస్పత్రుల్లో, జైళ్లలో పండ్లు, స్వీట్ల పంపిణీ, 20 న దేశభక్తి ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు, 21 న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, 22 న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.