తెలంగాణలో గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి సారథ్యంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 2022 లో కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని హైకోర్టు విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగానే కీలక తీర్పునిచ్చింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే… కోవిడ్ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించింది.గణతంత్ర దినోత్సవాలు జాతీయ పడంగ అని, దేశ భక్తిని చాటే పండగ అని కోర్టు పేర్కొంది. గణతంత్ర దినోత్సవం పరేడ్ తో నిర్వహించాలని సూచించింది. గణతంత్ర వేడుకల ఏర్పాట్లు త్వరగా చేయాలని సూచించింది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆవేదన వ్యక్త చేశారు. కోవిడ్ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు. ఈ విషయంపై తాను కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. మరోవైపు కొన్ని అనివార్య కారణాల రీత్యా పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలు నిర్వహించమని, రాజ్ భవన్ లోనే నిర్వహించాలని ప్రభుత్వం గవర్నర్ కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లోనే జాతీయ పతావిష్కరణ చేస్తున్నట్లు రాజ్ భవన్ పేర్కొంది. అయితే.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిస్థితులు మారే సూచనలు వున్నాయి.