తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జారీ చేశారు. అయితే.. డ్యూటీ చేస్తూ గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ముందుకుగా కారుణ్య నియామకాల్లో ప్రాధాన్యం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. గ్రేడ్ 2 డ్రైవర్ పోస్టుకు 19,000, కండక్టర్ గ్రేడ్ 2 పోస్టుకు 17,000, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టుకు 15000, శ్రామిక్ పోస్టులకు 15,000 కన్సలెటెడ్ జీతంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అంతేకాకుండా పెండింగ్ దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, వాటి విషయంలోనూ తక్షణమే నియామకాలు చేపడతామని వీసీ సజ్జనార్ ప్రకటించారు.
ఇక.. కారుణ్య నియామకం కింద ఎంపికైన వారు 3 సంవత్సరాలు పనిచేసిన వారి పని తీరును అంచనా వేసి, అందులో 60 శాతం మార్కులు సాధిస్తే.. పూర్తి స్థాయి స్కేలు సర్వీసులోకి తీసుకోనున్నారు. అయితే.. ఈ మూడేళ్లలో కారుణ్య నియామకాల కింద నియమింపబడిన ఉద్యోగి కచ్చితంగా ఏడాదిలో 240 రోజులు పనిచేసి ఉండాలన్న నిబంధన విధించారు. కారుణ్య నియామకాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి లేఖలు పంపుతామని, వారి నుంచి లిఖిత పూర్వక హామీ వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ వుంటుంది.