జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీలోని పర్గల్ ఆర్మీ బేస్ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. అయితే… ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే.. సెంట్రీగార్డు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని జమ్మూ జోన్ అదనపు డీజీ ముఖేశ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం చేయడం, కాల్పులు జరగడంతో సైన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశంలో అలజడులు చేసేందుకు రెడీగా వున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాయి. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని కూడా సూచించింది. మరోవైపు ఈ ఘటన జరగడంతో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో సైన్యం తనిఖీలు చేపట్టింది. 2016 లోనే జైషే మహ్మద్ ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి, ఉరీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది సైనికులు వీర మరణం పొందారు. ఈ ఘటన తర్వాతే భారత సైనికులు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది.