ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా ఉగాది సంబరాలు జరిగాయి. క్యాంపు కార్యాలయంలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో మొదటగా సీఎం జగన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సుబ్బరామ సోమయాజి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత నామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అన్ని శుభాలూ చేకూరాలని సీఎం ఆకాంక్షించారు. రైతులతో సహా అన్ని రంగాల వారికీ శుభాలు కలగాలని, దీని ద్వారా రాష్ట్రం సుభిక్షంగా వుండాలని ఆకాంక్షించారు. ఇక… కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీ శోభకృత నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు. పంచాంగ శ్రవణం చేసిన సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్ సత్కరించారు.