నటుడు జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ లో కచ్చితంగా రాజకీయ కోణం వుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చంద్రబాబుకు, ఎన్టీఆర్‌కు పడడం లేదని పుకార్లు నడుస్తున్న సమయంలో ఈ భేటీ జరిగిందని.. ఎన్టీఆర్‌కు రాజకీయ ఆసక్తి కూడా ఉందని చెప్పారు. గతంలో టీడీపీ పక్షాన జూనియర్ ప్రచారం నిర్వహించారని, పెద్ద ఆదరణ లభించిందని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ను బీజేపీ ప్రచారానికి వినియోగించుకునే ఛాన్స్ కచ్చితంగా వుందన్నారు.
లోకేశ్ ను అడ్డుకోవడం బాగో లేదు…
శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీ నేత లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడంపై కూడా అరుణ్ కుమార్ స్పందించారు. ఇలా అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లోకేశ్‌నైనా, చంద్రబాబునైనా, పవన్ కల్యాణ్‌నైనా, ఏ పొలిటికల్ లీడర్‌నైనా అడ్డుకోవడం చాలా తప్పుడు సంప్రదాయమని స్పష్టం చేశారు. జగన్ తిరిగినప్పుడు టీడీపీ ఇటువంటి ఆటంకాలు కలిగించలేదని.. సీఎం ఇది గుర్తుంచుకోవాలని అన్నారు.
మార్గదర్శి కేసులో రామోజీరావు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం మార్గదర్శిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు.ఇంతకాలం పట్టించుకోని జగన్ కేసు కొట్టివేస్తారనుకునే సమయంలో ఎస్‌ఎల్‌పీ వేయడం మంచిపరిణామమని అన్నారు. అందుకు తాను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వేసిన కేసు అది, ఆయన కుమారుడిగా జగన్ ఎప్పుడో కోర్టులో పిటిషన్ వేయాలని, ఇలా వేస్తారనుకోలేదని అన్నారు. ఇందులో ఏదో వ్యూహం ఉందన్నారు. సుప్రీంకోర్టులో సెప్టెంబరు 19న విచారణ ఉందని ఉండవల్లి పేర్కొన్నారు.