యూపీలో నీటిపారుదల మంత్రి దినేశ్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేసి సంచలనం చేశారు. దీంతో సీఎం యోగికి ఝలక్ తగిలింది. తన రాజీనామా లేఖను ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు పంపారు. కొన్ని రోజులుగా సీఎం యోగి తనను అవమానిస్తున్నారని, 100 రోజుల నుంచి తనకు పనులే అప్పగించడం లేదని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన శాఖకు సంబంధించిన బదిలీలల్లో చాలా అవకతవకలు జరిగాయని ఖతిక్ ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు చాలా బాధలు అనుభవించాని, అందుకే రాజీనామా చేసేశానని ఆయన ప్రకటించారు. తాను దళితుడినని, అందుకే పక్కన పెట్టేశారని, తాను మంత్రినని, అయినా అధికారాలు లేవని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా వున్నా సరే.. ఏ సమావేశాలకు కూడా తనను పిలవరని, తన శాఖ గురించి కూడా ఏమీ చెప్పరని మంత్రి వాపోయారు.
సీఎం యోగిపై జితిన్ ప్రసాద కూడా అలక?
ఇక… యూపీ కేబినెట్ లో కీలక మంత్రి అయిన యువనేత జితిన్ ప్రసాద కూడా సీఎం యోగిపై అలకబూనినట్లు తెలుస్తోంది. అయితే..ఆయను అధిష్ఠానం బుజ్జగిస్తోంది. అధిష్ఠానం కీలక నేతలతో జితిన్ ప్రసాద భేటీ అయ్యారు. జితిన్ ప్రసాద పబ్లిక్ వర్స్క్ శాఖను నిర్వహిస్తున్నారు. ఆ శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో సీఎంఓ విచారణకు ఆదేశించింది. అలాగే తీవ్ర అవకతవకలు చేసిన 5 గురు నేతలను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ చర్యలకే జితిన్ ప్రసాద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.