Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మకు ”ఉషశ్రీ సంస్కృతీ సత్కారం”

ఉషశ్రీ 96 వ జయంతి సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, వేద విశ్వవిద్యాలయ ఆచార్యులు బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మకు ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని ఉషశ్రీ మిషన్ అందజేసింది. హైదరాబాద్ లో ఈ నెల 19 న ఈ కార్యక్రమం ఏర్పాటైంది. సభకు ప్రముఖ రచయిత, బ్యాంకింగ్ రంగ నిపుణులు డాక్టర్ ఏ ఎస్ రామశాస్త్రి అధ్యక్షత వహించారు. అచ్చ తెనుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ ముఖ్య, విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

దారి తప్పి కాశీ వెళ్లి, ఇరవై ఏళ్లకు తిరిగొచ్చిన ఓ యువకుడి అనుభవాన్ని కథా రూపంలో వివరించారు కుప్పా వారు. మహామహుల మధ్య తాను ఉక్కిరిబిక్కిరవుతున్నానని చెప్పారు. ఆ యువకుణ్ణి గ్రామస్తులంతా మహా పండితునిగా ఎంచి సన్మానించారని… ఆసాంతం మౌన ముద్ర దాల్చిన యువకుడితో ఎలాగైనా మాట్లాడించాలని ఓ తాళ పాత్ర గ్రంథాన్ని ఇచ్చి చదివి సారాంశం చెప్పాల్సిందిగా కోరారని… దాన్ని చూసి ఆ యువకుడు కన్నీరు కార్చాడని చెప్పారు. యువకుడిని చూసి అందులోని అంశాన్ని తమకు వివరిస్తే తాము ఆనందిస్తామని అన్నారు. దాంతో ఆ యువకుడు భోరుమని… నేను చదువుకున్న పుస్తకాలలో పెద్ద పెద్ద అక్షరాలున్నాయి… మీరిచ్చిన తాళ పాత్ర గ్రంథంలో అక్షరాలూ అస్సలు కనిపించడంలేదు… ఇదీ నా కన్నీటికి కారణమని వివరించాడట…. అంటూ హేమా హేమీలున్న ఈ సభలో ఆ యువకుడి పరిస్థితే నాది అంటూ చమత్కరించారు కుప్పా వారు.

ఉషశ్రీ గారి పేరిట తనను సత్కరించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన గురువులకు ప్రణామాలు తెలియజేసారు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఉషశ్రీ గారితో తన అనుబంధాన్ని వివరించారు. ప్రవచనాలకు వెడుతుంటే ఆయనను ఒక హీరోగా ఆరాధించేవారని తెలిపారు. తన ప్రవచనాలు పండితుల కోసం కాదనీ, యువతరం కోసమేనని ఆయన చెప్పేవారని పాలపర్తి పేర్కొన్నారు. ఉషశ్రీ గారు సమయపాలనకు పెట్టింది పేరు అంటూ బంగారయ్య శర్మ, అనేక విషయాలను వివరించారు. ప్రముఖుల సమక్షంలో కుప్పా విశ్వనాథ శర్మకు సత్కారాన్ని అందజేశారు. నండూరి రామకృష్ణమాచార్య తనయుడు విద్యారణ్య, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ అనంతలక్ష్మి, బ్రిగేడియర్ శ్రీరాములు దంపతులు, ప్రముఖ పండితులు నూకల సూర్యనారాయణ, తెలంగాణ మంత్రి హరీష్ రావు ఓఎస్డీ జనార్దన్, లలితా సంగీత దర్శకుడు కలగా కృష్ణ మోహన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates