ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక… రాష్ట్రపతి ఎన్నికల్లో లాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్ లో వచ్చి, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓట్లు లెక్కించి, ఫలితాలు వెలువడతాయి. ఎన్డీయే అభ్యర్థిగా ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ ఆల్వా బరిలో నిలిచారు. ఉదయం 10 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమైంది.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10 తో ముగియనుంది. ప్రస్తుతం ఎన్డీయే పక్షాలన్నీ ధన్కర్ వైపు నిలుచున్నాయి. ఇక… మార్గరేట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది.