ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై… సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 725 మంది ఎంపీలు ఈ పోలింగ్ లో పాల్గొనగా… 92.9 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. మరోవైపు..ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైందని అధికారులు ప్రకటించారు. ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలు, టీడీపీ ధన్కర్ కు మద్దతిచ్చాయి.
ఇక…. టీఎంసీ ఈ ఓటింగ్ కు దూరంగా వుండాలని నిర్ణయించింది. అయితే.. సీఎం మమతను ధిక్కరించి టీఎంసీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఈ ఓటింగ్ లో పాల్గొనడం గమనార్హం. వీరి విషయంలో మమతా బెనర్జీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక… ఎన్డీయే పక్షాన ధన్కర్, విపక్షాల పక్షాన మార్గరేట్ ఆల్వా బరిలో నిలిచారు. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.
ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన మెజార్టీ ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగదీప్ ధంఖర్ గెలుపు దాదాపు లాంఛనమే. బీజేపీకి లోక్‌సభలో 303 మంది, రాజ్యసభలో 91 మంది సభ్యులు ఉన్నారు. అంటే 394 మంది సభ్యుల మద్దతు జగదీప్ ధంఖర్ కే ఉంది. అంతేకాదు.. శివసేన, జనతాదళ్ (యూ), బీఎస్పీ, బీజేడీ, ఏఐఏడీఎంకె, వైసీఆర్ సీపీ, తెలుగుదేశం, శిరోమణి అకాళీదళ్ లాంటి పార్టీలు కూడా ధన్కర్ కు మద్దతు ప్రకటించాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థికి 544 ఓట్లు పడే అవకాశాలున్నాయి.