బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయమే తీసుకున్నారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేయకుండా.. తెలంగాణ అమరవీరుల కలలను తుంగలో తొక్కిన కేసీఆర్ ను ప్రజలు సమర్ధించాల్సిన అసవరం ఏముందని ప్రశ్నించారు. మునుగోడులో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో విజయశాంతి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారా? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వనందుకు .. కేసీఆర్ ను సమర్ధించాలా ? కాళేశ్వరం ప్రాజెక్టును స్క్రాప్ గా మిగిల్చి.. వేల కోట్ల డబ్బులన్నీ జేబులో వేసుకున్నందుకు కేసీఆర్ ను సమర్ధించాలా ? అంటూ విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ కు నిజంగా భయం లేకపోతే… ఈడీ ఈడీ అంటూ ఎందుకు కలవరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి ఎన్నిక సమయంలో కేసీఆర్ బీబీసీని తీసుకొస్తారని, బ్రాండీ, బిర్యానీ, కరెన్సీని ఎరగా వేసి గెల్చి వెళ్లిపోతాడని విమర్శించారు. ఈసారి వాటికి లొంగొద్దు.. కేసీఆర్ కు బుద్ధి చెప్పండని ఓటర్లను విజయశాంతి కోరారు.