జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః !
శివలోకం హడావిడిగా ఉంది. నంది కలవరపడుతూ నాగరాజు, నెమలి, సింహ వాహనాల వైపు మార్చి, మార్చి చూస్తూ బయటకు రమ్మని సైగ చేసింది. అవన్నీ హడావిడిగా కైలాస ప్రాకారం పక్క సమావేశమయ్యా యి. అన్ని ఒక్కసారే ఏమైంది అని చిన్న గొంతుకలతో ప్రశ్నించాయి. వెంటనే నంది, ఏమి జరగడమేమిటి ఇవాళ ఉదయమే భూలోకం లో ఒక ఘోరం జరిగిపోయింది. కాశీనాధుని విశ్వనాధ్ అనే ప్రముఖ దర్శకులు భువిని వీడి మన కైలాసానికి విచ్చేశారు అంది. ఆయన ఎవరో దర్శకులు మన కైలాసానికి వస్తే మనకి జరిగే నష్టం ఏమిటి అన్నాయి మిగిలిన జంతు, పక్షి వాహనాలు. శివయ్య మనల్ని ఎందుకు పట్టించుకోరు? అన్నాయి నాగరాజు, నెమలి, సింహం. అందుకు నంది ఈ విశ్వనాధ్ అన్న ఆయన ఎవరనుకుంటున్నారు. గొప్ప తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఆయన శంకరాభరణం అన్న గొప్ప సినిమా నలభై వసంతాల క్రితం తీశారు. మన శివయ్య మెడలో ఉండే ఈ నాగరాజు పేరన్నమాట. ఆ చలనచిత్రం ఇప్పటికి, ఎప్పటికి అజరామరమే. అందులో పాటలు ఇప్పుడు మన శివయ్యకి ఇటీవలే ఆస్థాన గాయకుడై న శ్రీపతి పండితా రాధ్యుల బాలసుభ్రహ్మణ్యం పాడాడు. శంకరా నాదశరీరాపర పాట మనం బాలు నోట నిత్యం వింటూనే ఉన్నాం కదా! మరి మనకే ఆ పాటలు నచ్చితే మన శివయ్య సంగతి వేరే చెప్పాలా. ఆ చిత్రం లో సంప్రదాయ సంగీతానికి ఎంత పెద్ద పీట వేశారో చెప్పక్కరలేదుగా! ఇంక ఆయన తీసిన సిరివెన్నెల పేరే అద్భుతం. ఆ చిత్రానికి పాటలు రాసినందుకుగాను సీతారామ శాస్త్రికి సిరివెన్నెల ఇంటి పేరుగా మారిపోయింది. అంతేనా ఆ పాటలు వినడానికి వాళ్ళతో పాటు శివపార్వతులే కాకుండా మనం కూడా చెవులు కోసుకుంటున్నామా లేదా! అంతకు ముందు వచ్చిన కాలం మారింది, స్వయం కృషి సినిమాలు పాటల పరంగా బావుండడమే కాకుండా సామజిక అంశాల మీద గళమెత్తి నట్టయింది. ఆయన గొప్పతనమింతేనా! అన్నాయి శివ కుటుంబ వాహనాలు. అంతేనా ఏమిటి సంప్రదాయ కళల దుమ్ముదులిపి తెలుగు ప్రజలలో కళా పిపాసను రగిలించాడు. అంతేనా ఆంధ్రదేశంలో సంగీత, నృత్య కళాకారులకి అవకాశాలు పెరగడమే కాదు, గుర్తింపు, గౌరవం దక్కింది. ఆయన సంప్రదాయ సంగీతానికే కాదు, హిందుస్తానీ సంగీతానికి కూడా వైభవాన్ని సంతరించి పెట్టాడు. అందుకు సిరివెన్నెల చిత్రమే తార్కాణం ఇంకో సంగతేమిటంటే మహా మహా నటీ నటులే ఆయన చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్ళూరేవారు. ఆయన చిత్రాలకు ఆయనే కథనాయకుడు. పాత్రలు తమ పరిధి మేరకు నటించి వెళ్ళిపోతాయి. సంప్రదాయ చట్రంల్లో ఆధునికతకు చోటివ్వడం ఆయన ప్రత్యేకత. అందుకు ఉదాహరణ సప్తపది చిత్రం.
ఇంకేమిటి ఆయన గొప్పతనం అన్నాయి జంతు, పక్షి వాహనాలన్నీ గొంతెత్తి ఒక్కసారిగా.
ఆయన చిత్రాల్లో నటీమణులు అందంగా, అమాయకంగా ఉంటూనే ఎదో ఒక కళలో నిష్ణాతులై ఉంటారు అంతే కాదు ఆపదలను ఎదుర్కోవడంలో ధీర వనితలవుతారు. స్వాతిముత్యం చిత్రంలో రాధిక పాత్ర ను మలచిన తీరు చూస్తే ఆ చిత్రాన్ని ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది. అమాయకుడైన కమలహాసన్ తో ఆమె తన జీవితాన్ని పంచుకున్నతీరు, తన బిడ్డతో సమానంగా కమలహాసన్ ని చూసుకోవడం చాలా బావుంటుంది.
ఇక సప్తపది చిత్రంలో సబిత పాత్ర ఇష్టంలేని వివాహాన్ని చేసుకుని అత్తగారింట్లో నోరు మెదపకుండా ఆ బాధను భరించి, చివరకు తాను ఇష్టపడ్డ వ్యక్తి వద్దకు చేరుకునే వరకు ఆమె చూపిన నటనా ప్రతిభ అమోఘం.
ఇక సాగర సంగమం చిత్రంలో నటించిన జయప్రద అందం వర్ణనాతీతం. ఆమె నటనకు భాష్యం చెప్పలేము. ఏ స్త్రీ అయినా పెళ్లి, తాళి విషయాల్లో సంప్రదాయాన్ని కాదనుకోలేవేమో!
శుభశంకల్పంలో ఆమని ఆల్చిప్పల్లాంటి కళ్ళతో మన మనసుని గాలమేసి లాగేస్తుంది. శుభోదయం లో సులక్షణ పాత్ర
నిరాడంబరతకు నిదర్శనం. ఇక శుభలేఖ చిత్రంలో సుమలత పాత్ర వరకట్నానికి వ్యతిరేకంగా ఇంటిని కాదనుకుని విడిగా వచ్చేసి ఉంటూ, తన జీవితాన్ని తాను మలుచుకున్న తీరు అద్భుతం ఈ చిత్రంలో తులసి పాత్ర ధారిణి నటన అమోఘం. ఇంకో ముఖ్యవిషయ మేమిటంటే ఆయన సినిమాలన్నీ స,శ అక్షరాలాతోటే ఉంటాయి. పాటల్లో, మాటల్లో, పాత్రధారణలో మన శివయ్యకే అగ్రతాంబూలం. అందుకే
ఎన్ని వసంతాలు గడిచినా ఆయన చిత్రాలు, అందులోని పాత్రలు, సంగీతం, పాటలు మనల్ని అల రిస్తూనే ఉంటాయి. ఇంతవరకు ఆయన 40 చిత్రాలకు దర్శకత్వం వహించారుట. సౌండ్ ఇంజనీర్ గా పని చెయ్యడం వల్ల ఆయన చిత్రాల్లోని పాటలు అన్నీ శ్రవణ శుభగంగా ఉంటాయి. ఆయనకు ఎన్నో బిరుదులు వచ్చాయి. ఆయన మేటి చిత్ర దర్శకుడు. ఆయన తన చిత్రాల్లో పరిధి దాటని చక్కని హాస్యాన్ని పండించాడు. పలు చిత్రాల్లో నటించి నటుడి గా కూడా తానేమిటో, తన ప్రతిభ ఏమిటో నిరూపించుకున్నాడు.
నువ్వు చెప్తుంటే ఆయనని మన దగ్గరే అట్టే పెట్టేసుకోవాలనుకుంటున్నాము అన్నాయి శివ పరివార వాహనాలన్నీ.
సరే అయితే కొంతకాలం మన దగ్గరే ఉండనిద్దాం. తరువాత భూలోకానికి అక్కడి ప్రజలని అలరించడానికి పంపేద్దాం. అంతవరకు మరే చిత్రపరిశ్రమ వ్యక్తి మరికొన్ని దశాబ్దాలు మన శివలోకానికి రాకుండా భూలోకంలోనే ఉండాలని శాపమిస్తున్నాను. ఇక మన విశ్వనాథుడి వద్దకు వచ్చిన ఈ విశ్వనాధుడు భూలోకంలోనూ, శివలోకంలోను అజరామరుడే అంటూ ఉండగానే శివుడి ప్రధమ గణాల్లో ఒకరు వచ్చి ఇక్కడేం చేస్తున్నారు? శివయ్య మిమ్మల్ని వెతికి తీసుకురమ్మన్నారు అనడంతో జంతు, పక్షి వాహనాలన్నీ పొలోమని విశ్వ నాథుడి వద్దకు పరిగెట్టాయి.
– డాక్టర్ వడ్లమాని కనకదుర్గ