బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విశ్వ భారతి యూనివర్శిటీ భూమిని ఆర్థికవేత్త అమర్త్య సేన్ అప్పజెప్పారు. అమర్త్యసేన్ తనది అని పేర్కొంటున్న భూమి యూనివర్శిటీది అని, వెంటనే తమకు అప్పజెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పని యూనివర్శిటీ అమర్త్యసేన్ కి లేఖలు రాసింది. అయినా…. యూనివర్శిటీ వీసీ మాటలను లెక్క చేయకుండా… మమతా బెనర్జీ భూ యాజన్య హక్కు పత్రాలను అమర్త్య సేన్ కి అప్పగించారు. ఆయన ఎలాంటి భూకబ్జాలు చేయలేదని, ఇకపై ఆయన్ను ఎవరూ ప్రశ్నించలేరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విశ్వ భారతి యూనివర్శిటీ సీఎం మమతా బెనర్జీ తప్పులను వేలెత్తి చూపుతూ ఓ లేఖ రాసింది.
”మేము మీ (సీఎం మమతా) ఆశీస్సులు లేకుండానే మెరుగైన స్థితిలోనే వున్నాం. ఎందుకంటారా…. తాము ప్రధాన మంత్రి మార్గదర్శనంలో నడుస్తున్నాం” అంటూ వ్యాఖ్యానించింది. సీఎం మమత ప్రతి విషయాన్నీ చెవులతోనే వింటారని, ఎందుకేంటే తనను గుడ్డిగా ఫాలో అయ్యేవారు చెప్పేదే వింటుంటారంటూ విశ్వ భారతి యూనివర్శిటీ యాజమాన్యం ఎద్దేవా చేసింది. చెవుల ద్వారా ఆలోచించడం మానేసి, బుర్రకు పనిచెప్పాలని తాము కోరుకుంటున్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సీఎం కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన పార్థా ఛటర్జీ, సీఎం అపాయింట్ చేసిన వీసీ నేడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారని గుర్తు చేశారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే… సీఎం మమతా తన ఫాలోవర్స్ మాటలే విన్నారని, అందుకే ఇదంతా జరిగిందని యూనివర్శిటీ యాజమాన్యం చురకలంటించింది. సీఎం మమతకు బాగా దగ్గరి వ్యక్తి, బీర్బూమ్ ప్రాంతంలో కీలకమైన నేత అనుబ్రతా మండల్ కూడా ఇప్పుడు జైలు ఊచలను లెక్కిస్తున్నారని యాజమాన్యం గుర్తు చేసింది. తమ యూనివర్శిటీకి సంబంధించిన భూముల రక్షణ కోసం కంచె ఏర్పాటు చేస్తే.. దాని విషయంలోనూ సీఎం మమత ఇష్టమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని యూనివర్శిటీ వీసీ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం మమత నివసిస్తున్న ఇంటి చుట్టూ భద్రతా వలయం వుండదా? సీఎం నివాసానికి సరిహద్దు గోడలు పటిష్ఠంగా లేవా? అంటూ వీసీ ప్రశ్నల వర్షం కురిపించారు.