రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్ మొదలైంది. భద్రాచలం మునిగింది పోలవరం ప్రాజెక్ట్ తోనేనని, ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ముందునుంచీ తాము డిమాండ్ చేస్తున్నామని వ్యాఖ్యానించడంతో ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ప్రారంభమైంది. దీంతో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పోలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలం మునిగిందని, ఆ ప్రాజెక్టు నుంచి ఆలస్యంగా నీటి విడుదల చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు.
పోలవరం ఎత్తు తగ్గించాలని మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నామని, పోలవరం ముంపు పేరుతో 7 మండలాలను ఏపీలో విలీనం చేశారని, అక్కడ వరదలు వచ్చినా.. ప్రజలు అల్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఏపీలో విలీనం చేసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని, పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం డిజైన్ మార్చి, 3 మీటర్ల ఎత్తు పెంచుతున్నారని, ఇది జాతీయ ప్రాజెక్టు అని, ఎగువన ముంపు లేకుండా తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అజయ్ స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద కరకట్టలు కట్టినా అవి పటిష్టంగా లేవని, పోలవరం బ్యాక్ సమస్యపై అధ్యయనం చేయాలని అజయ్ సూచించారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్…
పోలవరం ప్రాజెక్టుకు, భద్రాచలం ముంపుకు ఎలాంటి సంబంధమూ లేదని ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లే తెలంగా; ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని వివరించారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని, 1986 లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపుకు గురైందని గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని అంబటి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతు లు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండినా (ఎఫ్‌ఆర్‌ఎల్) నష్టం ఉండదని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) పరిశోధించి తేల్చిందని చెప్పారు.