మహారాష్ట్రలోని ఔరంగబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను మారుస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా వివక్షను సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఔరంగాబాద్‌తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నామని, ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని తెలిపారు.ముస్లింలపై కొందరు ద్వేషభావాన్ని వ్యాప్తి చేస్తున్నారని, కానీ అలాంటి వారిపై ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. భారత్ జోడో యాత్రలో రాజస్థాన్ ప్రభుత్వం దేశం అంతా పాల్గొన్నదని, అల్వార్‌లో జరిగిన రాయల్ వెల్డింగ్‌లోనూ పాల్గొన్నదని, కానీ జునైద్, నాసిర్లను చంపిన చోటుకు ఆ ప్రభుత్వం వెళ్లలేకపోయినట్లు అసద్ ఆరోపించారు.
