కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందని సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని రాయనిగూడెం గ్రామంలో జరిగిన వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే ఉద్దేశ్యం తో వారిపై అవినీతి ఆరోపణలు రుద్దుతూ ఈడీ, సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ సంస్థలతో కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతుందని నరేంద్ర మోదీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదా? అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ లు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇటీవల ఆప్ నేతలపై కేంద్ర వైఖరిని ఎండగడుతూ ఇతర రాష్ట్రాల ప్రతిపక్ష ముఖ్యమంత్రులు స్పందించడం శుభ పరిణామన్నారు.
అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తొక్కి పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థ కు గొడ్డలిపెట్టు లాంటిదని మండిపడ్డారు. కేంద్ర సంస్కరణలను అమలు చేయకపోతే అప్పులు తెచ్చుకునే అవకాశం లేకుండా కేంద్రం కొర్రీలు పెడుతుందని విమర్శించారు. సంస్కరణల్లో భాగంగా తెలంగాణ లో విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని తిరస్కరించడం అభినందనీయమన్నారు.