లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగ వ్యవస్థలపై తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను ఎలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన పార్లమెంట్ కి హాజరయ్యారు. లండన్ స్పీచ్ పై స్పందించమని కోరగా… తాను దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. అయితే… తనను అనుమతిస్తే సభలో మాట్లాడతానని ప్రకటించారు. సభలో ఛాన్స్ రాకపోతే… పార్లమెంట్ బయట మాట్లాడతానని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటన్ ఎంపీలతో సమావేశంలో విమర్శించారు. ‘మా మైకులు పనిచేయవా అంటే చేస్తాయి. అవి అవుట్ ఆఫ్ ఆర్డర్ కాదు. కానీ వాటిని స్విచాన్ చేయలేం. నేను మాట్లాడేటప్పుడు ఈ అనుభవం నాకు చాలాసార్లే ఎదురైంది’ అని తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ, చైనా సైన్యం చొరబాటు ఇలా అనేక అంశాలపై పార్లమెంటులో మాట్లాడడానికి తమను అనుమతించలేదని చెప్పారు. లోతైన చర్చలు జరిగే వేదికగా పార్లమెంటు తనకు గుర్తుందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు.
అయితే… రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్ ను, ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరిచారని బీజేపీ తీవ్రంగా దుయ్యబట్టింది. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు పార్లమెంట్ లోపల, వెలుపలా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తుల భాషలో మాట్లాడుతున్నారనీ, భారతదేశాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు కుట్ర పన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు కిరణ్ రిజిజు ఆరోపించారు. లండన్ లో భారత్ గురించి రాహుల్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తోటి పార్లమెంట్ సభ్యుని చర్యను ఖండించకపోతే ప్రజలు ప్రశ్నిస్తారనీ, లండన్ లో చేసిన వ్యాఖ్యలకు సభలో క్షమాపణలకు డిమాండ్ చేస్తామని కిరణ్ రిజిజు మీడియాతో అన్నారు. తాము ప్రజాప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నామని చెప్పిన ఆయన.. భారత వ్యతిరేక శక్తులు, ముఠాలన్నీ ఒకే భాష, లైన్ కలిగి ఉన్నాయని కాంగ్రెస్, రాహుల్ పై విమర్శలు చేశారు.