మార్చి ఏడవ తేదీ, హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా అంగరంగ వైభవంగా సిద్ధమైంది. ఆ వైభవం అంతా పాత్రికేయ రంగంలో రాణిస్తున్న మహిళల సత్కారం కోసం. మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా వేడుకలకు సిద్ధమైంది హుస్సేన్‌సాగర్ తీరం. ఇందులో తన పాత్ర ఏమీ లేదా అని సూర్యుడు ఎర్రముఖం వేసుకుని అస్తమించాడు. సూర్యుడి వెలుగుకు దీటుగా కాకపోయినా మా వంతు వెలుగులు ప్రసరిస్తామన్నట్లుగా వెలిగిపోతున్నారు మహిళా జర్నలిస్టులు.
డిజిటల్ మీడియాలో రాణిస్తున్న పాత్రికేయ మహిళల నుంచి మొదలైన సత్కార కార్యక్రమం దినపత్రికల్లో తమ ముద్రను చూపిస్తున్న మహిళల వరకు సాగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్గంలోని ఇద్దరు మహిళలు సత్యవతిరాథోడ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ బాధ్యతల్లో మహిళ ఉండడం ఇదే తొలిసారి. ఆమె కూడా పాత్రికేయుల సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ప్రతినిధులు కనిపించకపోతే పొలిటికల్ మైలేజ్ దక్కవచ్చు దక్కక పోవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించడానికి కేటీఆర్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆద్యంతం సజావుగా సాగిన కార్యక్రమంలో సెల్ఫీ చికాకులు మాత్రం తప్పలేదు. ఉమెన్ జర్నలిస్టులు మంత్రుల మీద పడిపోయి ఫొటోలు తీసుకోవడం చూస్తుంటే జర్నలిజం గౌరవం అవనతమవుతోందా అనిపించింది.
అందరూ ఉద్యమకారులే!
కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది లెఫ్ట్ ఉద్యమకారులమని చెప్పుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేవాళ్లే. రాజకీయ నాయకులంటే దోపిడీదారులని వాదించేవాళ్లే. ప్రజాప్రతినిధులను గౌరవించడం అంటే తమ వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టడం అని గర్జించేవాళ్లే. ఆ గళాలు సెల్ఫీ కోసం పాకులాడడం ఏమిటి? ఈ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని లైక్‌ల కోసం, సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఎదురు చూడడం ఏమిటో? జర్నలిస్టులంటే తమ కలంతో స్వయం ప్రకాశకంగా వెలగాల్సిన వాళ్లు. అలాంటిది ప్రమోషన్ దివిటీల కోసం వెంపర్లాట ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ తన పునాదిని తానే పాతాళంలో కుంగదీసుకుంటోందా?