రాష్ట్రపతి అభ్యర్థులు ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా తమకు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నయ్యారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రధాని మోదీకి, రక్షణ మంత్రి యశ్వంత్ సిన్హా, బీజేపీ అగ్రనేత అద్వానీకి ఫోన్లు చేశారు. తనకు మద్దతివ్వాలని కోరారు. ఈ ముగ్గురితో చాలా సేపు ఫోన్లో మాట్లాడారు. అయితే.. యశ్వంత్ సిన్హా తన నామినేషన్ ఇంకా దాఖలు చేయలేదు. అయినా.. ప్రచార పర్వానికి తెర లేపడం ఆశ్చర్యం. వీరితోనే కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీ నేతలకు, ముఖ్యులకు కూడా యశ్వంత్ సిన్హా ఫోన్లు చేయనున్నారు. తనకు మద్దతు పలకాలని అభ్యర్థిస్తారు.
విపక్ష నేతలకు ద్రౌపది ముర్ము ఫోన్..
ఇక ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్య మంత్రుల సమక్షంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఘట్టం పూర్తి కాగానే ప్రచారాన్ని ప్రారంభించారు. పలువురు విపక్ష నేతలతో ఫోన్లు చేశారు.
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్లు చేశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఇక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా విపక్ష నేతలకు ఫోన్లు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్, మాజీ ప్రధాని దేవేగౌడ, ఫరూక్ అబ్దుల్లాకు ఫోన్లు చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరచాలని నడ్డా వారిని కోరారు.