భారత ఎంబసీ ఆధ్వర్యంలో వాషింగ్టన్ లోని స్మారక స్థూపం వద్ద యోగా సెషన్ జరిగింది. రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా సెషన్ జరిగింది. దీనికి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కేవలం భారత సంతతి వారే కాదు… అమెరికా అధికారులు, కాంగ్రెస్ సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సేతురామన్ పంచనాథన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన అతిగొప్ప బహుమతుల్లో యోగా ఒకటి అని సేతురామన్ ప్రకటించారు. వివిధ ప్రాంతాలన్నింటినీ ఏకత్రం చేసే శక్తి యోగాకు ఉందన్నారు. మనసు, శరీరం మధ్య సమన్వయం సాధించడంలో యోగాదే కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు.
ఇక అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు కూడా పాల్గొన్నారు. యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మికతతో పాటు మేధో పరమైన శ్రేయస్సును కూడా పెంచుతుందని వివరించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులను నయం చేయడంలో యోగా ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రజల మధ్య, దేశాల మధ్య యోగా అనేది మరింత అనుసంధానాన్ని పెంచుతుందని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని సంధు పేర్కొన్నారు.