Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

చెప్పాడంటే చేస్తాడంతే….అతడే వై ఎస్ జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కొన్ని విషయాలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమి చెప్తాడో అది చేసి తీరుతాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా అనడానికి ఆయనే ఒక ఉదాహరణ. బహుశా భారత దేశంలో మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పంధాలో నడవలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు. అందుకు ఈ నాలుగేళ్లలో ఆయన చేపట్టి అమలు చేసిన పథకాలే నిలువెత్తు నిదర్శనాలు.
మరి ముఖ్యంగా మహిళా సాధికారతకు పట్టం కట్టాడు. ఏ సమాజం బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా జనాభాలో సగభాగమైన మహిళలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనడానికి అన్నది ఆయన విశ్వాసం. దాన్నే అమలుపరిచారు. అందాక ఎందుకు మన చుట్టూ కొన్ని వర్గాలు, కొన్ని కులాలను చూస్తే కూడా….. ఎవరైతే ఆడపిల్లలు అని చిన్న చూపు చూడకుండా వారిని విద్యావంతులుగా చేశారో ఆ వర్గాలు, ఆ కులాలు ఇవాళ రాజకీయ, విద్య, వ్యాపార, ఆర్థిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్నారు. అందుకే కాబోలు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ మహిళలకు అన్నింట 50% అవకాశాలు కల్పించాలన్న దృఢ నిశ్చయంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగుతుంది. అంది వచ్చిన అవకాశాలతో పైన చెప్పుకున్న అన్ని రంగాల్లో ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో 50 శాతం పైగా మహిళలు ప్రధాన భూమిక వహిస్తున్నారు.
అన్నింట ముందుచూపే…..
అందుకు తాజా ఉదాహరణ… సి ఆర్ డి ఎ పరిధిలో 50,793 మంది పేద, మధ్యతరగతి మహిళలకు జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. పేదలందరికీ మంచి జరగాలి అందునా మహిళలకు అని భావించి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకుని మరీ ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు.
అంతర్జా తీయ భావనలతో ….
ప్రపంచవ్యాప్తంగా ఉమెన్ మేనిఫెస్టోలు, జెండర్ బడ్జెట్ ల భావన పెరిగింది. ఉచితాలు కాదు ప్రభుత్వ పథకాలతో కుటుంబ జీవన ప్రమాణాలు పెరగాలి….. తిరిగి ఆ లబ్ది నేరుగా మహిళలకి అందాలి. ఉత్త మాటలు కాదు. వాటిని ముందుగా మేనిఫెస్టోలో పెట్టాలి. అవి అమలు అయ్యేలా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. ప్రత్యేకంగా మహిళల కోసం అంటూ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు వుండాలి(ప్రత్యేకించి మహిళల కోసం అంటూ శాఖల వారిగా కేటాయింపులు ). అప్పుడే రాజకీయ పార్టీలు, నాయకులు చెప్పేవి నీటి మీద రాతలుగా కాకుండా అమలులో నిజరూపం దాల్చుతాయి అన్న ఉద్దేశంతో అనేక ఎన్జీవోలు, మహిళా మేధావులు, హక్కుల నేతలు ఉమెన్ మేనిఫెస్టోలు- జెండర్ బడ్జెట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ భావనలు అంతర్జాతీయ వేదికల మీద చర్చించాకా , సంతకాలు పెట్టినా ఆచరణలో చూస్తే వేళ్ళ మీద లెక్కించదగ్గ దేశాలు మాత్రమే ఈ భావనలను అమలులోకి తెచ్చాయి. అలాంటి అంతర్జాతీయ భావనలకు రాష్ట్రస్థాయిలో తీసుకుని, అమలుపరిచిన ఘనత మాత్రం వైయస్ జగన్ కే దక్కుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అమ్మ ఒడి, ఆసరా, చేయుత, పింఛన్లు, గోరుముద్ద, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ రుణాలు, అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మహిళలు లబ్ది పొందారు. దేశ దేశాల్లో మహిళలకు వారి పేరుతో నివాసయోగ్యం కల్పించాలని డిమాండ్ జెండర్ బడ్జెట్లో భాగంగా ఎప్పటినుంచో ఉంది. ఉచిత విద్య , వైద్యం తో పాటు సొంత ఇల్లు ఆమెకు భరోసా, రక్షణ, భద్రత ఇస్తాయి. ఈ మాటలను ఉత్త మాటలుగా కాక రాజకీయ పార్టీలు వాటి మేనిఫెస్టోలో ఉంచాలి అన్న డిమాండ్ కూడా ఉంది. 26 జిల్లాల్లోనూ ఐదు లక్షల నుంచి 15 లక్షల రూపాయల విలువైన సెంట్ స్థలo ఆమె పేరుతో ఇంటి పట్టా ఇవ్వడం వల్ల దాదాపు 30.60 లక్షల మంది మహిళలకు స్థిరమైన ఆస్తిని ఇవ్వడమే కాక చరమాంకంలో భద్రత తో కూడిన జీవితాన్ని ఇచ్చాడని చెప్పాలి. పైగా ఇల్లు ఉచితంగా నిర్మించి ఇస్తుంది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ. ఇంతకన్నా భరోసా ఎక్కడ దొరుకుతుంది. అలాగే ఇతర పథకాలు కూడా ఆమె కుటుంబానికి దన్నుగా నిలుస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు , వాలంటీర్లలో 50% పైగా మహిళలే ఉన్నారు. ఇదే కదా సాధికారత అంటే.
నాటి నడకే నేటికి మార్గదర్శకం…..
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్రలో చూసిన వెతలకు , ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలను పార్టీ మేనిఫెస్టోలో వుంచి , వాటి అమలుకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వడం అనేది 2019 నుంచే నాంది పలికి గత నాలుగు సంవత్సరాలుగా తు .చ . తప్పకుండా అమలు చేస్తూ నాన్న ఒక అడుగు వేస్తే నేను నాలుగు అడుగులు వేసి జనం వైపు నిలుస్తాను అన్న మాటకు కట్టుబడి ఐదో సంవత్సరం పరిపాలనలోకి అడుగులు వేస్తున్నారు వై ఎస్ జగన్ . గత నాలుగు సంవత్సరాలలో ఇచ్చిన హామీల్లో 98.5% నెరవేర్చి దాదాపు 2.11 లక్షల కోట్లు సంక్షేమం కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు.
ఎన్నికలకు మరో ఏడాది ఉన్న తరుణంలో ఈ సంవత్సరం కూడా అదే విధంగా వైసిపి ప్రభుత్వం ముందుకు సాగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. వివిధ పథకాల ద్వారా అర్హత వున్న ప్రతి కుటుంబం 60 వేల నుంచి లక్షా 10 వేల వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో లబ్ధి పొందారని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. కరోనా సమయం లో కూడా వారి కొనుగోలు శక్తి తగ్గలేదని కూడా వారు గుర్తు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమం అందినప్పుడే ఆ కుటుంబాల్లోని మహిళలు- బాలికలకు మెరుగైన విద్య, వైద్యం, సమతుల ఆహారం అందుతుందని తద్వారా అసమానతలు తగ్గి సామాజిక అభివృద్ధి జరుగుతుందని వేరే చెప్పనక్కర్లేదు. మరి ఇదే కదా సాధికారతకు అర్థం.
పండలనేని గాయత్రి
స్వతంత్ర జర్నలిస్ట్

Related Posts

Latest News Updates