ముఖ్యమంత్రి కేసీఆర్ కి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షూలను గిఫ్ట్ గా పంపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తనతో కలిసి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. తనతో కలిసి పాదయాత్ర చేసేందుకే సీఎంకి షూస్ ను గిఫ్ట్ గా పంపుతున్నానని అన్నారు. తమ పాలన అద్భుతమని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతుంటారని, రాష్ట్రంలో సమస్యలు లేవని తేలితే… తాను ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. సమస్యలు వున్నట్లు కేసీఆర్ గుర్తిస్తే… వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని, దళితుడ్ని సీఎం చేయాలని డిమాండ్ చేశారు.
అయితే… గవర్నర్ తమిళిసైతో భేటీ కావాలని భావించామని, అయితే.. సమయాభావం వల్ల భేటీ కాలేకపోతున్నామని షర్మిల వివరించారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని బీఆర్ఎస్ పాలనకు అంతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయని, మళ్లీ ఓట్ల కోసం కేసీఆర్ వస్తారని షర్మిల అన్నారు. కేసీఆర్ మాటలు విని మోసపోవద్దని కోరారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు
టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరుతానని తనకు పొంగులేటి మాట ఇచ్చారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా విషయాలన్నీ ఆయననే అడగాలని సూచించారు. కొన్ని రోజుల క్రిందటే పొంగులేటి వైఎస్ షర్మిలతో భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. షర్మిల వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరుతారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముందు నుంచి కూడా పొంగులేటికి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలే వున్నాయి.