తెలంగాణలోని ఖమ్మం రాజకీయాలు మంత్రి పువ్వాడ వర్సెస్ వైస్ ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలగా మారిపోయాయి. కొన్ని రోజులుగా ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా వైస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం ఖమ్మంలోని పాలేరులో పర్యటిస్తున్నారు. పువ్వాడ అజయ్ వేధింపులు భరించలేకే.. ఖమ్మంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు.
ఖమ్మంలో నియంతల పాలన సాగుతోందని, ఉత్తి పుణ్యానికి పువ్వాడ అజయ్ మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రి పదవిలో ఉన్నానన్న హుందాతనం ఆయనలో లేదని, ఎంత సంపాదించినా, కబ్జాలు చేసినా.. ఆయనకు ధనదాహం తీరదని విరుచుకుపడ్డారు. కొత్త బిచ్చగాడి తీరులో కబ్జాలు చేస్తున్నారని షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పువ్వాడ అజయ్ కౌంటర్..
వైఎస్ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ అంతే తీరులో ఘాటుగా స్పందించారు. అన్న వైఎస్ జగన్ తో పంచాయితీ వుంటే ఆంధ్రలో చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కళ్లలో తూటాలు పేల్చి పరిటాల రవిని హత్య చేసింది మీరేనంటూ విరుచుకుపడ్డారు. ఉక్కు నుంచి భూముల వరకు అన్ని కబ్జాలు, దందాలు చేసిన ఘనత మీ కుటుంబానిదే అంటూ పువ్వాడ ఫైర్ అయ్యారు. ఒట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే.. మీ అన్నలా డబ్బులిచ్చి తీసుకోవాలా? అంటూ పువ్వాడ ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీ చేసి గెలిచి చూపించాలని, పాలేరులోనూ తన దమ్ము చూపిస్తానని పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు.
తాజాగా మళ్లీ కౌంటర్ ఇచ్చిన షర్మిల
పువ్వాడ అజయ్ మంత్రే కాదని.. ఆయనో కంత్రీ అని వైస్ఆర్టీపీ ప్రెసిడెంట్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం తాను ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తే క్యాట్ వాక్ అంటావా? అంటూ ఫైర్ అయ్యారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. తన మెడికల్ కాలేజీకి నష్టం కలుగుతుందని భావించే.. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని రానివ్వడం లేదని పువ్వాడపై మండిపడ్డారు. పువ్వాడ నాయకత్వంలోనే ఆర్టీసీ మూతపడే స్టేజీకి వచ్చిందని విమర్శించారు.