తన తండ్రిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలని, తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి చెప్పానని వివేకారెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి హత్య విషయంలో కుటుంబీకుల పైనే నిందలు వేస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నాలుగో వర్ధంతి సందర్భంగా తన తండ్రి సమాధి వద్ద కుమార్తె వైఎస్ సునీతారెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ల పని వాళ్లని చేయనీయాలని సునీత కోరారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే బయటకు రావాలని సునీత పేర్కొన్నారు. పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తామని.. అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. కడపలో అరాచకాలు తగ్గాయని అందరూ అంటున్నారని, కానీ పెరిగాయని ఆరోపించారు. అందుకు తన తండ్రి హత్యే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. తప్పు చేసిన వాళ్లకి శిక్షపడితేనే నేరాలు తగ్గుతాయని వైఎస్ సునీత పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కాబట్టి తానేమీ మాట్లాడలేనని ఆమె పేర్కొన్నారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నాలుగేళ్లు. ఆయనను 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని సొంతింట్లోనే దారుణంగా హత్యచేశారు. గొడ్డలివేటుతో పాశవికంగా మట్టుబెట్టారు. నాలుగేళ్లు గడిచినా…. హత్యకు సూత్రధారులైన వారు మాత్రం ఇంకా దొరకడం లేదు. దీనిపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు హంతకులు ఎవరనేది దర్యాప్తు సంస్థలు తేల్చలేకపోయాయి. మొత్తంగా 100 మంది సాక్షులు, 1461 మంది అనుమానితులను విచారించినా హంతకులు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు.