తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తన సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నానని ప్రకటించారు. 2 నెలల ముందే వైసీపీకి దూరంగా వున్నానని అన్నారు. అయినా… ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా వున్న ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు తీసుకున్నారన్న సజ్జల కామెంట్స్ సరికావని పేర్కొన్నారు. టీడీపీలో గెలిచి, వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు సజ్జల ఎన్నికోట్లు ఇచ్చారో చెప్పాలని కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
వైసీపీలో చాలా మంది ఉడికిపోతున్నానని, మరో పార్టీ కోసం ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తున్నారని కోటంరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల కోసం ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నారని, రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందని మండిపడ్డారు. రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని, పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓటమి కనిపించిందన్నారు.
తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం కొరడా ఝుళిపించింది. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.