వైసీపీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, 3 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తోందంటూ మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా వున్న తనపై నిఘా పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది నడుస్తుండగానే… కోటంరెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్లు భావిస్తున్న ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగుతానన్న మాటలు ఆ ఆడియోలో వున్నాయి. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న బలమైన ఆధారాలు తన వద్ద వున్నాయని, వాటిని బయటపెడితే.. ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు ఊడిపోతాయని ఆడియోలో కోటంరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం షేక్ అవుతుంది.. సెంట్రల్ ఎంక్వైరీ వస్తుంది’’ అని కోటంరెడ్డి ఆడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఆడియో తెగ వైరల్ అవుతోంది.
తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. 3 తరాలుగా తను వైఎస్ కుటుంబానికి విధేయుడిగానే వున్నానని, అయినా… తన ఫోన్ ట్యాప్ చేయించడం ఏంటని మండిపడ్డారు. రాజకీయాలు తనకు కొత్తేమీ కాదని, ఎత్తు పల్లాలు ఎరిగిన వాడినని పేర్కొన్నారు. తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటిస్తామని వైసీపీ అంటోందని, వైసీపీ తరపున తన తమ్ముడు పోటీ చేస్తే మాత్రం… తాను బరిలో వుండనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా… రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని కూడా ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తన మనసు కలత చెందిందని అన్నారు. అనుమానాలు వున్న చోట కొనసాగడం కష్టమని స్పష్టం చేశారు.
మరోవైపు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేసేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగం సిద్ధం చేసింది. ఆయన స్థానంలో ఆనం విజయ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలలో ఒకరికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రంగంలోకిదిగారు. దీంతో కోటంరెడ్డిపై ఏ క్షణమైనా వేటుపడే అవకాశం ఉంది. మరోవైపు ఈ వ్యవహారంపై బాలినేని స్పందించారు. సొంత పార్టీ నేత ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇది కేవలం కోటం రెడ్డి అపోహ మాత్రమే అన్నారు. ట్యాపింగ్ విషయమై కోటం రెడ్డి ఎవరికీ చెప్పకుండా బహిరంగంగా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.