వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదం వైసీపీలో ఇంకా నడుస్తూనే వుంది. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీ సీనియర్ నేత సజ్జలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని తనపై మాటల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి పార్టీకి ఏం చేశారని పదవులిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేస్తారని పదే పదే లీకులు ఇస్తున్నారని, రండి… ఎప్పుడు వస్తారో రండి.. అని కోటంరెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరు వైసీపీ ఇంచార్జీగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డికి కోటంరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఆఖరి వరకూ వుండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని, కానీ తాను అలా చేయలేదన్నారు.
అధికార పార్టీకి దూరమవుతే.. ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు బాగా తెలుసని కోటంరెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లోకి కొత్తగా ఏమీ రాలేదని, విద్యార్థి నేతగా మొదలు మొత్తం 35 సంవత్సరాలుగా రాజకీయాలను చూస్తున్నానని అన్నారు. వైసీపీ విషయంలో తన మనసు విరిగిపోయిందని, తాను ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చానని అన్నారు. తన గొంతును ఆపాలంటే తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే దారని.. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనిల్ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయన్నారు.
సీఎం జగన్‌కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. తనను సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. తప్పు చేయకుండా ఉంటే దేవుడు తనకు అండగా ఉంటాడన్నారు. గతంలో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తన కుటుంబం అల్లాడిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. తన కుటుంబం.. అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని కోటంరెడ్డి తెలిపారు.