తమ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దిగివచ్చిందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. తెలంగాణలో ఏ విషయానికీ కేంద్రం దిగిరాలేదా? కేవలం ఆంధ్రా విషయంలోనే కేంద్రం దిగొచ్చిందా? అంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏం జరిగింది? సింగరేణిపై కేంద్రం దిగిరాలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. సింగరేణిని కేంద్రం అమ్మేస్తోందని బీఆర్ఎస్ తెగ ప్రచారం చేస్తోందని, మరి ఆ విషయంలో కేంద్రం దిగి రావడం లేదా? అంటూ దెప్పిపొడిచారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వీళ్లను చూసి తగ్గిందా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్లు ఉంటుందన్నారు. మరి తెలంగాణలో ఎందుకు తగ్గటం లేదని ప్రశ్నించారు.
ఇంతకీ మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణను విరమించుకుందని కేంద్రం ప్రకటించడం సీఎం కేసీఆర్ ఘనతేనని మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబితే ..ఎలా చేస్తారో చూస్తామని కేసీఆర్ గట్టిగా మాట్లాడారని.. అధ్యయనం కోసం సింగరేణిని ఏపీకి పంపిస్తామని ఒక్క మాట అనగానే కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. వెంటనే కేంద్రమంత్రి విశాఖ ఉక్కుపై ప్రకటన చేశారని.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని తాము భావించడం లేదన్నారు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదన్నారు. విశాఖపట్నంలోని కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేసే పనిలో వున్నామని, స్టీల్ ప్లాంట్ లో కొన్ని కొత్త విభాగాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపైనే నడుస్తున్నామని, పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. RNIL యాజమాన్యం, కార్మిక సంఘాలతో ఈ పరిస్థితిపై చర్చిస్తామని కులస్తే ప్రకటించారు. అయితే… విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా కేంద్ర మంత్రి ఫగ్గన్ కులస్తే స్పందించారు. అదో ఎత్తుగడ మాత్రమే అని కొట్టిపారేశారు.