బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ పై దాడి జరగడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. సీఎం జగన్ ప్రోద్బలంతోనే ఎంపీ నందిగం సురేష్ మనుషులు దాడికి దిగారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విబిరంలో వున్న వారిపై ఆదినారాయణ రెడ్డి మనుషులే దాడి చేశారని ఆరోపించారు. అమరావతి రైతుల దగ్గర ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. ఆదినారాయణ రెడ్డి అనుచరులు మూడు రాజధానుల టెంట్ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్నారు.
సత్యకుమార్ కారులో కూర్చొని వెకిలిగా నవ్వారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షనులో ఆదినారాయణ రెడ్డి మూడు రాజధానుల శిబిరంపై దాడికి పాల్పడిందని నందిగం సురేష్ అన్నారు. అసలు గొడవకు మూలకారణం ఆదినారాయణ రెడ్డి అన్న ఆయన…సత్యకుమార్ అనవసరంగా ఈ వ్యవహారాన్ని తనపై వేసుకుంటున్నారన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఉద్దండరాయునిపాలెంలో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. 915 రోజులుగా దీక్ష చేస్తున్నారు. వారిపై దాడికి ప్రేరేపించిన చంద్రబాబును, దాడికి పాల్పడిన బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, సత్యకుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.