కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో మోదీ సర్కార్ విఫలమైందని అన్నారు. ధరల పెరుగుదలపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఆర్బీఐపై వుందన్నారు. అటు ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ ఎందుకు విఫలమయ్యాయని సూటిగా నిలదీశారు. ఇతర దేశాల్లోని ద్రవ్యోల్బణం రేటుతో పోల్చుకొని, మనం మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రభుత్వం పదే పదే చెబుతోందని, ఇదేమాత్రం సరికాదని స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం అన్నింటిపైనా జీఎస్టీ విధిస్తోందని, చివరికి తిరుమల వేంకటేశ్వరుడిపై కూడా జీఎస్టీ విధించారని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం చట్టబద్ధత లేని పన్నుల వడ్డింపు లాంటిదని అభివర్ణించారు. నిత్యావసర వస్తు ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోందన్నారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై వుందని విజయసాయి రెడ్డి అన్నారు. ధరల పెరుగుదలను వెంటనే అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.