తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం కొరడా ఝుళిపించింది. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
విశ్వాసం లేనప్పుడు పార్టీలో వుంచడం అనవసరమని, సీఎ జగన్ కూడా ఇదే అభిప్రాయంతో వున్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ నలుగురూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించారని, క్రాస్ ఓటింగ్ కి కూడా పాల్పడ్డారని, అందుకే సస్పెన్షన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ జరిపామని, దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎమ్మెల్యేలు కొన్నారని, డబ్బులు చేతులు మారినట్లు కూడా తాము నమ్ముతున్నామని ఆరోపించారు. ఒక్కొక్కరికి చంద్రబాబు 15 కోట్ల నుంచి 20 కోట్లు ఆఫర్ చేశామని, క్రాస్ ఓటింగ్ చేసిన వారికి టిక్కెట్ కూడా ఇస్తామని చెప్పి వుండొచ్చని సజ్జల పేర్కొన్నారు.