తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు (Teacher MLC votes Counting) ప్రారంభమైంది. సరూర్‌నగర్ (Saroornagar) ఇండోర్ స్టేడియంలోని కౌంటింగ్ సెంటర్‌లో (Counting center) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.
కేంద్రంలోని రెండు గదుల్లో ఓట్ల లెక్కింపునకు మొత్తం 28 టేబుళ్లను అధికారులు ఏర్పాటుచేశారు. ఒక్కో గదిలో ముగ్గురు ఏఆర్వోలను, రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అదనంగా మరో ముగ్గురు ఏఆర్వోలను నియమించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఈ నెల 13న పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలోని 9 జిల్లాల్లో సుమారు 29,720 మంది ఓటర్లు ఓటు నమోదుచేసుకున్నారు.
ఇక… ఏపీలోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే.. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెలువడింది. వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా… రామారావుకి 632 ఓట్లు వచ్చాయి. ఇక.. పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందార. కవురు శ్రీనివాస్ కి 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్ కి 460 కోట్లు వచ్చాయి. ఇక… కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు.